: చైనాలో అద్దెకు బాయ్ ఫ్రెండ్స్... జోరుగా వ్యాపారం!
చైనాలో కాలంతో పాటే యువత పరుగెడుతోంది. ప్రేమ పేరుతో సహజీవనానికి చాలా మంది మొగ్గుచూపుతుండగా, తాజాగా సరికొత్త వ్యాపారం జోరుగా సాగుతోంది. జీవితంలో విచ్చలవిడిగా స్వేచ్ఛను అనుభవించాలని భావిస్తున్న యువతులు 25 ఏళ్లు దాటుతున్నా వివాహానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఇదే సమయంలో కుటుంబ సభ్యుల ఒత్తిడిని తట్టుకునేందుకు బాయ్ ఫ్రెండ్స్ ను కుటుంబాలకు చూపుతూ, వివాహం చేసుకుంటామని కుటుంబ సభ్యులకు సర్దిచెబుతూ వివాహాన్ని కొంత కాలం వాయిదా వేస్తున్నారు. మరీ ఒత్తిడి చేస్తే బ్రేకప్ అయిందనో, లేక ప్రియుడు మోసం చేశాడనో చెప్పి చేతులెత్తేస్తున్నారు.
సాధారణంగా జనవరి 28న చైనాలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చైనాలోని పట్టణాల్లో ఉంటున్నవారంతా పల్లెలకు వెళుతుంటారు. ఈ సందర్భంగా కుటుంబానికి విలువనిచ్చే పల్లెవాసులు వారిని వివాహం గురించి ప్రశ్నిస్తుంటారు. దాని నుంచి తప్పించుకునేందుకు అద్దెమొగుడు లేదా ప్రియుడ్ని సెట్ చేసుకుంటున్నారు. ఇలా అద్దె మొగుడు లేదా ప్రియుడ్ని సరఫరా చేసేందుకు చైనాలో చాలా సంస్థలున్నాయి. అయితే అందుకు 10 నుంచి 15 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ ధర కూడా పర్సనాలిటీ, విద్యార్హతలు, వ్యక్తిత్వం ఆధారంగా నిర్ణయిస్తారు.
ఇంత మొత్తం చెల్లించేందుకు యువతులు వెనుకాడడం లేదని అబ్బాయిలను సరఫరా చేసే ఏజెన్సీలు చెబుతున్నాయి. అయితే అకస్మాత్తుగా అతనిని కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తే వారు నమ్మే అవకాశం ఉండకపోవడంతో ముందుగానే ఒకరినొకరు కలుసుకునే అవకాశాలు కల్పించి, అవసరమైన తర్ఫీదు, సమాచారం ఇచ్చి, ఆ తరువాతే ఏజెన్సీలు యువతులకు బాయ్ ఫ్రెండ్స్ ను సరఫరా చేస్తాయని తెలుస్తోంది. చైనాలో ఈ వ్యాపారం జోరందుకుంటోందని తెలుస్తోంది. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువత ఏది పూలదారో, ఏది ముళ్లదారో తెలీక ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. స్వేచ్ఛ పేరుతో వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.