: ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు సంచలన వ్యాఖ్యలు
శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లర్ల ఎన్ కౌంటర్ అనంతరం సొంత శాఖకు చెందిన అధికారుల నుంచే ఛీత్కారాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని టాస్క్ ఫోర్స్ డీఐజీ కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో నిర్వహించిన వర్క్ షాప్ కు పోలీస్, ఏసీబీ, ఇంటెలిజెన్స్, టీటీడీ సెక్యూరిటీ, అటవీ సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంతారావు మాట్లాడుతూ, రూ.5 వేలు లంచం ముట్టనిదే సంతకం పెట్టని ఓ అదనపు ఎస్పీ సైతం ఎగతాళిగా మాట్లాడటం తనను బాధించిందన్నారు. పోలీస్ శాఖలోని కొందరు లంచగొండి సిబ్బంది పోలీస్ శాఖ వాహనాల్లోనే ఎర్రచందనం తరలిస్తున్నారని, ఈ అధికారులను మీడియాలోని ఒక వర్గం పొగడ్తలతో ముంచెత్తడం దారుణమని ఆయన విమర్శించారు. విమర్శలతో కుంగిపోయిన ఓ డీఎస్పీ ఆత్మహత్య చేసుకుంటాడని భావించి, సిబ్బందిని కాపలా పెట్టిన వైనాన్ని కాంతారావు వివరించారు.