: తాగి వాహనం నడిపినందుకు న్యాయమూర్తికి శిక్ష!
త్రిపురలోని ఓ స్థానిక కోర్టు జడ్జికి త్రిపుర హైకోర్టు శిక్ష విధించింది. తీర్పులు చెప్పాల్సిన న్యాయవాదికే శిక్షపడడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే... 2014 జూన్ 6వ తేదీన జడ్జి మోటోమ్ డెబ్బార్మా మద్యం సేవించి వాహనం నడిపారు. దానిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు ఆయన ప్రమాదకర పరిస్థితిలో వాహనం నడిపినట్లు తేల్చి ఆయన జీతంలో రెండు ఇంక్రిమెంట్లు ఆపాలని తీర్పునిచ్చింది. ఈ ఘటనకు పాల్పడిన సమయంలో డెబ్బార్మా సెపాహిజాలా జిల్లాలోని బిశాల్‌గఢ్‌లో సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆయనను పట్టుకున్న పోలీసులు అదుపులోకి తీసుకొని సుమారు పది గంటలు జైల్లో ఉంచారు.
అయితే, తనని జైలులో ఉంచిన విషయాన్ని సదరు జడ్జి ఆ సమయంలో తన పై అధికారులకు చెప్పకుండా దాచిపెట్టారు. అనంతరం ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు అలా చేయడాన్ని నిబంధనల ఉల్లంఘనగా పేర్కొన్నారు. అనంతరం ఆయన తాను తప్పు చేసినట్లు ఓ లేఖను సమర్పించారు.