: ఆ బాల్ గర్ల్ ను నేనే.. నాడు నన్ను ఓదార్చినందుకు ధన్యావాదాలు: టెన్నిస్ ప్లేయర్ సోంగాకు లేఖ
ఫ్రెంచ్ ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ జో విల్ ఫ్రిడ్ సోంగా తనకు చేసిన సాయాన్ని మరవలేనని ఆస్ట్రేలియా బాల్ గర్ల్ జులియానా అంటోంది. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఒక సంఘటన కారణంగానే సోంగాకు ఆమె తన కృతజ్ఞతలు చెప్పింది. ఆ సంఘటన వివరాలలోకి వెళితే.. ఆట సీరియస్ గా జరుగుతున్న సమయంలో బాల్ గర్ల్ జులియానాకు టెన్నిస్ బాల్ తగలడంతో ఏడ్చింది. ఈ విషయం గమనించిన సోంగా, ఆమె దగ్గరకు వెళ్లాడు. దీంతో, సోంగా భుజంపై తన తల ఉంచిన జులియానా వెక్కి వెక్కి ఏడవడంతో, వెంటనే, టెన్నిస్ కోర్టు నుంచి బయటకు తీసుకువెళ్లాడు. ఆమెకు విశ్రాంతి నిచ్చి, పంపించి వేయాలని నిర్వాహకులకు సోంగా చెప్పాడు. అనంతరం, సోంగా తన ఆట కొనసాగించాడు.
ఈ విషయాన్ని గుర్తుంచుకున్న జులియానా సోంగాకు కృతజ్ఞతలు చెబుతూ, లేఖ రాసింది. ఫ్రెంచ్ భాషలో ‘మెర్సీ’ (ధన్యవాదాలు) అని చక్కగా డిజైన్ చేసి రాసిన ఈ లేఖలో ఆమె ఏం పేర్కొందంటే.. ‘మీరు రెండో మ్యాచ్ రెండో రౌండ్లో ఉండగా కోర్టు బయటికి వచ్చి నాకు సాయం చేసినందుకు ధన్యవాదాలు. నేను మీకు ఙ్ఞాపకం ఉండకపోవచ్చు కానీ, ఆరోజు మీరు కోర్టు బయటకు తీసుకువెళ్లిన బాల్ గర్ల్ ని నేనే. నాపై మీరు చూపించిన దయకు ధన్యావాదాలు. నాకు కొంత సాయం అవసరమని గుర్తించిన మీరు, నన్ను స్వయంగా కోర్టు వెలుపలికి సాగనంపినందుకు నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఆ రోజున నేను తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాను. అందుకే, బాల్ ఇవ్వమని అడిగినా వెంటనే నేను అందించలేకపోయాను. అందుకు క్షమాపణలు’ అని ఆ లేఖలో జులియాని పేర్కొంది. కాగా, ఈ లేఖకు స్పందించిన సోంగా, తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించాడు. ‘నువ్వు రాసిన లేఖకు నా కృతజ్ఞతలు జులియానా!’ అని పేర్కొంటూ, వాళ్లిద్దరూ కలిసి ఉన్న నాటి ఫొటోతో పాటు ఆమె రాసిన లేఖను పోస్ట్ చేశాడు.