: ప్రజా సొమ్మును మూటగట్టుకొని ప్రత్యేక ప్లేన్‌లో పారిపోయిన గాంబియా దేశాధ్యక్షుడు!
గాంబియాను సుదీర్ఘకాలం పాటు పాలించిన ఆ దేశాధ్యక్షుడు యాయేహ్ జమ్మెహ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. తన ప్రత్యర్థి అదామా బారో చేతిలో ఓటమి చవిచూసిన ఆయన... తన ఓటమిని అంగీకరించకుండా కొన్ని రోజులు మొండిచేశారు. ప్రజాతీర్పును వ్యతిరేకిస్తున్నట్లు, ఫలితాలను తాను అంగీకరించనని ఉద్ఘాటించారు. అయితే, పశ్చిమ ఆఫ్రికా ప్రాంతీయ దేశాలు ఈ అంశంలో కల్పించుకోవడంతో ఆయన చివరకు పదవిని విడిచిపెట్టేందుకు ఒప్పుకున్నారు. కాగా, ఆయన తమ దేశం నుంచి వెళ్లిపోతూ ప్రజలను కష్టాల్లో పడేశారు.
దేశం నుంచి వెళుతున్న సమయంలో యాయేహ్ జమ్మెహ్ ప్రజా ఖజానాను లూటీ చేశారు. తనతో పాటు సుమారు 11 మిలియన్ల డాలర్లు (రూ.75 కోట్లు) తీసుకువెళ్లారని ఆయనపై అక్కడి అధికారులు ఫిర్యాదు చేశారు. ఖరీదైన కార్లతో పాటు పలు విలువైన వస్తువులను కూడా ఆయన దోచుకుపోయినట్లు ఆరోపించారు. వాటిని ప్రత్యేక ప్లేన్‌లో తరలించినట్లు పేర్కొన్నారు. మరోవైపు నూతన ప్రెసిడెంట్‌గా ఎన్నికైన ఆదామా బారో ప్రస్తుతం సెనిగల్‌లో ఉన్నారు. ఆయన కోసం ఆ దేశ ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు.