u.p: శ్మశానంలో ఆఫీసు పెట్టుకొని.. పాడెపై ఓటర్ల ఇంటి వద్దకు వెళ్లి ఓటు వెయ్యాలని అడుగుతున్న అభ్యర్థి


ఉత్తరప్రదేశ్‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో గోరఖ్‌పూర్‌లోని చౌరీచౌరా నియోజకవర్గం నుంచి రాజన్‌ యాదవ్‌ అలియాస్‌ ఆర్తి బాబా అనే 34 ఏళ్ల వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా బ‌రిలోకి దిగారు. అయితే, ఆయ‌న ప్ర‌చారం చేస్తోన్న తీరుని చూస్తే ఎవ్వ‌రైనా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. అంద‌రిలాగే రొటీన్‌గా ప్ర‌చారం చేసుకుంటూ పోతే త‌న‌ను ఓట‌ర్లు ఎలా గుర్తు పెట్టుకుంటార‌ని అనుకున్నాడో ఏమో.. విభిన్నంగా ప్ర‌చారం చేస్తూ వార్త‌ల్లోకి ఎక్కుతున్నాడు. ప్రచారం కోసం పాడెపై ఓటర్ల ఇంటి వద్దకు వెళుతున్నాడు. అనంత‌రం ఓట‌ర్ల కాళ్లు కడిగి తనకే ఓటు వెయ్యాలని కోరుతున్నాడు.

తాను ఇలా విభిన్న రీతిలో ఎందుకు ప్ర‌చారం చేస్తున్నాడో కూడా వివ‌రిస్తూ... సమాజంలో సామాన్యులు తమ హక్కులు పొందలేకపోతున్నారని రాజన్‌ యాదవ్‌ అన్నారు. మ‌నుషులు బతికి ఉన్న‌ప్ప‌టికీ ఈ వ్యవస్థ చనిపోయినట్లుగా భావించేలా చేస్తోందని, అందుకే తాను ఇలా ప్ర‌చారానికి వెళుతున్నాన‌ని వివ‌రించారు. ఆ పాడెను ఆయ‌న‌ మద్దతుదారులు మోసుకుంటూ వెళుతుండ‌గా ఆయ‌న దానిపై కూర్చొని ప్రచారంలో పాల్గొంటూ బిజీబిజీగా ఉన్నారు. మ‌రో విచిత్రమైన విష‌యం ఏంటంటే ఆయన త‌న‌ కార్యాలయాన్ని కూడా రాజ్‌ఘాట్ శ్మ‌శానంలోనే ఏర్పాటు చేసుకున్నారు.

ఇంత‌కీ ఈ అభ్య‌ర్థి చ‌దువురాని వ్య‌క్తి ఏం కాదు.. ఆయ‌న‌ గోరఖ్‌పూర్‌ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ డిగ్రీ సంపాదించారు. గ‌తంలో జ‌రిగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. కాగా,  2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయ‌న ఏకంగా నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌లపై పోటీ చేద్దామ‌ని అనుకున్నారు. మోదీ నియోజ‌క‌వ‌ర్గ‌మైన‌ వారణాసి నుంచి, రాజ్‌నాథ్ పోటీకి దిగిన ల‌క్నో నుంచి ఆయ‌న లోక్‌స‌భ స్థానాల‌కు నామినేషన్‌ వేయగా ఆయన దస్త్రాలను ఎన్నిక‌ల అధికారులు తిరస్కరించారు. అంతేగాక అప్ప‌ట్లో గోరఖ్‌పూర్‌ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌పై కూడా పోటీకి దిగి ప‌రాజ‌యం పాల‌య్యారు. ఈసారి మాంత్ర‌ తాను త‌ప్ప‌కుండా విజ‌యం సాధిస్తాన‌ని చెబుతున్నాడు.

u.p
  • Loading...

More Telugu News