: మరో ఏడాదిలో అమెరికా నుంచి 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఖాళీ చేయాల్సిందే: నాస్కామ్


గడచిన దశాబ్ద కాలంలోనే ఎన్నడూ లేనంత ఒత్తిడిలో భారత ఐటీ ఇండస్ట్రీ ఉందని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో స్థానిక అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాల్సి వుండటంతో, భారత కంపెనీల సంప్రదాయ ఐటీ సేవల వ్యాపారానికి విఘాతం కలుగనుందని సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. 2018 నాటికి దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు అమెరికాను వీడాల్సి వస్తుందని అంచనా వేసిన ఆయన, ఈ ఖాళీల భర్తీకి తగినంత మంది టెక్కీలు యూఎస్ లో అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. స్టెమ్ (సైన్స్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మేథమెటిక్స్) ప్రోగ్రామ్ లో భాగంగా యూఎస్ లో రిజిస్టర్ అవుతున్న వారిలో 50 శాతం మంది విదేశీయులేనని గుర్తు చేసిన ఆయన, అమెరికాలో ఉద్యోగ సృష్టి ఇటీవలి కాలంలో పెరుగుతూ రావడానికి విదేశీ సంస్థల వ్యాపార విస్తరణ, అభివృద్ధి ప్రణాళికల అమలు కారణమని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు.

ఎన్నో భారత ఐటీ కంపెనీలు అమెరికాలో కార్యాలయాలు స్థాపించాయని గుర్తు చేసిన ఆయన, ట్రంప్ వచ్చిన తరువాత ఐటీ కంపెనీలు ప్రతి క్షణమూ ఆందోళన చెందుతున్నాయని అన్నారు. ఆయన ఉద్దేశాలేమిటో స్పష్టంగా తెలియడం లేదని అన్నారు. కొత్త ప్రభుత్వం వేసే అడుగులను బట్టి ఐటీ కంపెనీల భవిష్యత్ నిర్ణయాలుంటాయని తెలిపారు. అమెరికన్ ఐటీ దిగ్గజాలైన గూగుల్, ఫేస్ బుక్, ఐబీఎం వంటి కంపెనీలు కూడా వీసా విధానం సరళతరంగా ఉండాలని అభిప్రాయపడుతున్నాయని, ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వంతో చర్చించేందుకు వచ్చే నెలలో బృందాన్ని అమెరికాకు తీసుకెళ్లనున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News