: ఎట్టకేలకు మెరీనా తీరం ఖాళీ... రిపబ్లిక్ వేడుకలను బహిష్కరించాలని తమిళ యువత నిర్ణయం


దాదాపు ఆరు రోజులుగా చెన్నై మెరీనా బీచ్ లో తిష్ట వేసి, జల్లికట్టుకు చట్ట బద్ధత కల్పించాలంటూ పోరాడుతున్న తమిళ యువతను ఈ ఉదయం పోలీసులు బలవంతంగా చెదరగొట్టారు. మెరీనా బీచ్ ని ఖాళీ చేయించే క్రమంలో కొంత వాగ్వాదం, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పటికీ, బీచ్ కి దారితీసే అన్ని రహదారులనూ మూసివేసిన పోలీసులు, ఉదయం 5:30 గంటల నుంచి స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించారు. దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి, యువ ఆందోళనకారులను బలవంతంగా బీచ్ నుంచి పంపారు.

శాంతియుత నిరసనలు తెలుపుతున్న తమపై పోలీసులను ప్రయోగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన యువత, రెండు రోజుల్లో రానున్న గణతంత్ర వేడుకలను బహిష్కరించాలని వినూత్న నిర్ణయం తీసుకుంది. ఎవరూ కూడా రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనరాదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాగా, మరోవైపు దుండిగల్, అరియలూరు, కోయంబత్తూరు తదితర ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతున్న యువతను కూడా పోలీసులు తరిమేశారని తెలుస్తోంది. కొన్ని చోట్ల పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వినట్టు వార్తలు వస్తున్నాయి.

కోయంబత్తూరులో నిరసనకారులతో చర్చించేందుకు కోడిస్సా గ్రౌండ్స్ కు వెళ్లిన మంత్రి ఎస్పీ వేలుమణి, పోలీస్ కమిషనర్ లపై యువకులు రాళ్ల దాడికి దిగగా, వారు అక్కడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. మధురైలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. త్రిచి, నీల్లాయ్, తేణి, తిరువల్లవర్, శివకాశీ ప్రాంతాల్లో నిరసనకారులు వారంతట వారే ఆందోళన విరమించినట్టు అధికారులు తెలిపారు. జల్లికట్టుకు అత్యంత కీలకమైన అలంగనల్లూరులో మాత్రం ఆందోళన విరమించేందుకు ప్రజలు ససేమిరా అంటున్నారు.

  • Loading...

More Telugu News