: వాషింగ్టన్ నుంచి లాస్ఏంజిలెస్ దాకా.. అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కిన లక్షలాదిమంది మహిళలు
డొనాల్డ్ ట్రంప్‌కు ఓట్లేసిన ప్రజలే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్నారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా ఆయన ఏ ముహూర్తాన ప్రమాణ స్వీకారం చేశారో కానీ నిరసనల హోరుతో అమెరికా హోరెత్తిపోతోంది. ట్రంప్‌కు వ్యతిరేకంగా రోడ్డెక్కుతున్న వారి సంఖ్య రోజురోజుకు అనూహ్యంగా పెరుగుతోంది. సాధారణ ప్రజల నుంచి కళాకారులు, రాజకీయ నాయకులు, గృహిణులు.. ఇలా ఒకరనేమిటి? అందరూ అధ్యక్షుడికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు.
తాను ఎందరో మహిళలను వశపరుచుకున్నానంటూ ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వాషింగ్టన్‌లో ఐదు లక్షల మంది, షికాగోలో 1.5 లక్షల మంది, బోస్టన్‌లో లక్ష మంది, లాస్ఏంజిలెస్‌లో లక్షలాదిమంది మహిళలు రోడ్లపైకి చేరుకుని ట్రంప్‌కు వ్యతిరేకంగా నినదించారు. కొన్నిచోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇది ఆరంభం మాత్రమేనని, మున్ముందు భారీ తిరుగుబాటును చూస్తారంటూ మహిళలు హెచ్చరించారు. ప్రస్తుత కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు భారత సంతతి మహిళా సభ్యులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీలోని పెన్సిల్వేనియా అవెన్యూలో ఆదివారం సాయంత్రం ఏకంగా ఐదు లక్షలమంది చేరుకుని ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌ను ముట్టడించేందుకు నిరసనకారులు విశ్వప్రయత్నం చేశారు. నిరసన తెలుపుతున్న మహిళలను భద్రతా దళాలు ఎక్కడికక్కడ అడ్డుకున్నాయి.