: గిన్నిస్ బుక్ రికార్డు కోసం కాళ్లకు గోనె సంచులు కట్టుకుని ఈత.. కానిస్టేబుల్ మృతి
కొత్త పద్ధతిలో ఈత కొట్టి గిన్నీస్ బుక్‌లోకి ఎక్కాలని కృష్ణా నదిలో సాధన చేస్తోన్న విజయవాడ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ లంక ఉమామహేశ్వరరావు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే ఈతలో ఆయన పేరిట అనేక అవార్డులు, రికార్డులు ఉన్నాయి. ఈనెల 27వ తేదీన మరో సాహసం చేసి గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించుకోవాలని ఆయన అనుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఈరోజు ఉదయం కృష్ణా నదిలో కాళ్లకు గోనె సంచులు కట్టుకుని ఈత కొడుతుండగా గుండెపోటు వచ్చింది.
ఆయనను తోటి ఈతగాళ్లు దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆయన ప్రాణాలు నిలవలేదు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం ఓలేరు. ఇప్పటికే ఆయన ఈతలో లిమ్కాబుక్ ఆప్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకొని అందరితో శభాష్ అనిపించుకున్నారు.