: నోట్ల రద్దుతో నాకు సంబంధం లేదు.. నన్ను శిక్షించకూడదు: పంజాబ్ బీజేపీ మంత్రి అనిల్ జోషి
మరికొన్ని రోజుల్లో పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ప్రచార కార్యక్రమాల్లో బిజీబిజీగా ఉంటున్నారు. అయితే పంజాబ్ మంత్రి, బీజేపీ నేత అనిల్ జోషి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూ పెద్దనోట్ల రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అందుకు గాను ప్రజలు తనను శిక్షించకూడదని అన్నారు. ఆయన అమృత్ సర్ నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక మంత్రిగా తన పదవీ కాలం ముగిసిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఓటర్ల దగ్గరకు వెళ్లి తనకు ఓటు వేయాలని కోరాలని జోషి తన మద్దతుదారులకి తెలిపారు. నోట్లరద్దు నేపథ్యంలో పరిస్థితులు తలకిందులయ్యాయని కొంతమంది ప్రజలు మండిపడవచ్చని, దానిపై ఇప్పుడేమీ చేయలేమని వారితో చెప్పండని ఆదేశించారు. తాను ఎల్లప్పుడూ ప్రజల తరఫునే పోరాడతాడని ప్రజలకు తెలపాలని ఆయన తన మద్దతుదారులతో అన్నారు. ఓటర్లతో మాట్లాడేటప్పుడు కార్యకర్తలు జాగ్తత్తగా వ్యవహరించాలని అన్నారు. అకాలీదల్ సర్కారుతో దూరంగా ఉంటున్న జోషి తన ప్రచారంలో సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ పేరును ఎక్కడా వినిపించలేదు.