: అధ్యక్షుడిగా ట్రంప్ రెండో రోజు... మీడియాపై అక్కసు వెళ్లగక్కడంతోనే సరి!
వార్తా సంస్థలపై అక్కసు వెళ్లగక్కడంతోనే అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో రోజు సరిపోయింది. తనపై అమెరికా మీడియా కక్షకట్టిందని, ప్రజా మద్దతుతో తాను విజయం సాధిస్తే, దాన్ని అంగీకరించేందుకు మీడియా సిద్ధంగా లేదని ఆయన నిప్పులు చెరిగారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలు భారీ ఎత్తున హాజరైతే, తక్కువ మంది వచ్చినట్టు మీడియాలో కథనాలు రావడాన్ని ఆయన తప్పుబట్టారు. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలను పెద్దవిగా చేసి చూపుతున్నారని ఆరోపించారు.
కాగా, ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం ఏరియల్ చిత్రాలను, 2009లో ఒబామా ప్రమాణ స్వీకారోత్సవం వేళ హాజరైన వారి ఏరియల్ చిత్రాలను పలు పత్రికలు పక్కపక్కనే ప్రచురించాయి. వీటిని చూస్తుంటే మాత్రం ఒబామా ప్రమాణం చేసిన వేళ అధికులు హాజరైనట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ట్రంప్ ఈ నిజాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేరంటూ వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. ఇక ట్రంప్ పట్ల మీడియా వ్యతిరేకంగా ఉందని ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ వ్యాఖ్యానించారు. వైట్ హౌస్ మీడియా బ్రీఫింగ్ రూము నుంచి తొలిసారిగా మాట్లాడిన ఆయన, జాతీయ మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని మండిపడ్డారు. ఇదిలావుండగా, ఒబామా ప్రమాణ స్వీకారోత్సవం సమయంలో 7.82 లక్షల మంది హాజరు కాగా, ట్రంప్ కార్యక్రమానికి 5.71 లక్షల మంది వచ్చారని వాషింగ్టన్ మెట్రోపాలిటన్ ఏరియా ట్రాన్సిట్ అథారిటీ ప్రకటించింది.