: భారత టెక్కీలకు కష్టకాలం... అమెరికన్ల వైపు మొగ్గుతున్న టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో


అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత భారత ఉద్యోగులకు, ముఖ్యంగా హెచ్-1బీ వీసాలపై అమెరికాకు వెళ్లి పని చేసే టెక్నాలజీ రంగ నిపుణులకు కష్టకాలం ప్రారంభమైనట్టేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించే దిశగా ట్రంప్ నిర్ణయాలు ఒత్తిడి తెస్తుండటంతో, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి భారత ఐటీ దిగ్గజాలు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాలని నిర్ణయించాయి. అమెరికన్ క్యాంపస్ ల నుంచే రిక్రూట్ మెంట్లను ప్రారంభించాలని ఈ సంస్థలు భావిస్తున్నాయి. యూఎస్ లోని కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్ మెంట్ ను పెంచాలని ఆలోచిస్తున్నట్టు ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు వెల్లడించారు.

వాస్తవానికి భారత ఐటీ ఇండస్ట్రీ 200 బిలియన్ డాలర్లకు చేరగా, మొత్తం ఆదాయంలో 75 శాతం అంటే, సుమారు 150 బిలియన్ డాలర్ల వరకూ ఎగుమతుల వల్లే లభిస్తోంది. ఈ 150 బిలియన్ డాలర్లలో 60 శాతం వరకూ అమెరికా నుంచి లభిస్తోందన్న సంగతి తెలిసిందే. యూఎస్ లో శాఖలను ఏర్పాటు చేసుకున్న ఐటీ దిగ్గజాలు, ఆయా సెంటర్లలో అమెరికన్లను విధుల్లోకి తీసుకుంటే, వారికి అధిక వేతనాలు చెల్లించాల్సి వస్తుందన్న ఆలోచనతో, ఇండియా నుంచి ఉద్యోగులను ఎంపిక చేసుకుని అక్కడికి పంపుతూ లాభాలను పెంచుకుంటూ సాగాయి. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తరువాత ఐటీ కంపెనీలపై దృష్టిని సారించడం, వీసాల జారీని కఠినం చేసేలా చర్యలకు ఉపక్రమించడంతో అందుకు అనుగుణంగానే ఐటీ కంపెనీల ఆలోచనా మారుతోంది.

ఇకపై ఆన్ సైట్ ఉద్యోగుల్లో అధికులను యూఎస్ నుంచే తీసుకోవాల్సి రావచ్చని టీసీఎస్ మానవ వనరుల విభాగం హెడ్ అజోయేంద్ర ముఖర్జీ వ్యాఖ్యానించారు. ఇక ఇండియాలో ఐటీ కంపెనీలు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఆఫర్ చేసే ప్రారంభవేతనం సగటున రూ. 3.5 లక్షలలోపే ఉండగా, అమెరికాలో ప్రారంభ వేతనమే రూ. 27 లక్షలు (40 వేల డాలర్లు). ఇక వీలైనంత వరకూ ఆఫ్ షోర్ కార్యకలాపాలను పెంచాలని కూడా ఐటీ కంపెనీలు భావిస్తున్నాయి. ఇండియాలోని కేంద్రాల నుంచే అమెరికన్ క్లయింట్ల పనులు చక్కబెట్టే ఆలోచనలో ఉన్నాయి. ట్రంప్ తీసుకునే నిర్ణయాలను పరిశీలించి ఆపై నిర్ణయాలు తీసుకుంటామని, ఏదేమైనా అమెరికాలో నియామకాలు పెంచక తప్పక పోవచ్చని ఐటీ కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి.

  • Loading...

More Telugu News