: ‘జల్లికట్టు’ ఉద్యమం ఆంధ్రులకు స్ఫూర్తి దాయకం: పవన్ కల్యాణ్


‘జల్లికట్టు’ ఉద్యమ స్ఫూర్తితో  ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని జనసేన పార్టీ అధినేత  పవన్ కల్యాణ్ అన్నారు. ఈ మేరకు ఆయన తెలుగులో ఒక ట్వీట్ చేశారు.‘‘జల్లికట్టు’పై ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని జనసేన పార్టీ స్వాగతిస్తోంది. ఇది సరైన సమయంలో తీసుకున్న సముచిత నిర్ణయం. తమిళనాడులో అంకురించిన ఉద్యమం గతంలో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమంలా మారకముందే కేంద్ర ప్రభుత్వం విజ్ఞత ప్రదర్శించటంతో దేశ సమగ్రతకు భంగం తప్పింది.....తమిళుల పోరాట పటిమను ఈ ఉద్యమం ప్రతిబింబించింది... ఈ ఉద్యమం నుంచి ఆంధ్రులు నేర్చుకోవలసింది ఎంతో ఉందని గుర్తు చేస్తున్నాను.

మన రాజకీయ నేతలు కూడా ఇటువంటి సంఘీభావాన్ని ప్రదర్శించాలని కోరుకుంటున్నాను. ‘జల్లికట్టు’ ఉద్యమ స్ఫూర్తితో ‘ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా’ సాధించాలి. అయితే, వ్యాపార నిబద్ధత ఎక్కువగా ఉండి, రాజకీయ నిబద్ధత తక్కువగా ఉన్న మన రాజకీయ నేతలు తమిళ ఉద్యమం నుంచి ఎంత వరకు స్ఫూర్తి పొందుతారనే దానిపై నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. అయితే, ఈ విషయంలో రాజకీయ నేతలు రాజీ పడినా ప్రజలు మాత్రం రాజీపడబోరన్న గట్టి నమ్మకం నాకు ఉంది’ అని పవన్ కల్యాణ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News