: చంద్రబాబు గారూ! ‘జల్లికట్టు’ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకోండి: కేవీపీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఒక లేఖ రాశారు. ఏపీకీ ప్రత్యేక హోదా సాధించే విషయంలో ‘జల్లికట్టు’ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం చంద్రబాబు పోరాడాలని, రాష్ట్రానికి నాయకత్వం వహించాలని కోరారు. ప్రత్యేక హోదా ఉద్యమానికి చంద్రబాబు నాయకత్వం వహిస్తే కనుక, అన్నివర్గాలు ఆయనకు తోడుగా నిలుస్తాయని అన్నారు. ‘చట్టవిరుద్ధమైన ‘జల్లికట్టు’నే తమిళులు సాధించుకున్నారు. చట్టబద్ధమైన హామీలను మనం ఎందుకు సాధించుకోలేం? ప్రత్యేక హోదా సాధించలేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతాం. భవిష్యత్ తరాలకు తీరని నష్టం చేసిన వారమవుతాం’ అని ఆ లేఖలో కేవీపీ పేర్కొన్నారు.