: నేడు అమెరికాలో ఎవరు ఎవరినైనా కౌగిలించుకోవచ్చు.. షరతులు వర్తిస్తాయి!
అవును.. నేడు అమెరికాలో ఎవరు, ఎవరినైనా కౌగిలించుకోవచ్చు. అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి అమెరికన్లకు కొత్త అధ్యక్షుడు ఇచ్చిన ఆఫర్ ఇదని భావిస్తే పొరపాటు పడినట్టే. ఎందుకంటే ఇదేదో ఇప్పుడే ప్రారంభమైన కొత్త ఆచారం కాదు. 1986 నుంచి ప్రతి ఏటా జనవరి 21న జరుగుతున్నదే. హగ్ డే పేరిట ఈ రోజు ఎవరు ఎవరినైనా కౌగిలించుకోవచ్చు. కెవిన్ జబోర్నీ అనే వ్యక్తి దీనిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు.
క్రిస్మస్ నుంచి వాలెంటైన్స్ డే వరకు అంతా పండుగ మూడ్‌లో ఉంటారు కాబట్టి దానిని కంటిన్యూ చేసేందుకు మధ్యలో ఏదైనా ఒక రోజును నేషనల్ హగ్గింగ్ డేగా నిర్ణయిస్తే బాగుంటుందని కెవిన్ అనుకున్నాడట. దీనివల్ల ఆత్మీయతలు పెరుగుతాయని, అనుబంధాలు బలపడతాయన్నది కెవిన్ ఆశ. కెవిన్ ఆశకు అమెరికన్ల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అంతే.. జనవరి 21, 1986 నుంచి కౌగిలింతల రోజును దిగ్విజయంగా జరుపుకుంటున్నారు. అయితే చిన్న కండిషన్. ఎవరినైనా హగ్ చేసుకోవచ్చు కదా అని ముందస్తు అనుమతి లేకుండా కౌగిలించుకుంటే మాత్రం జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందే. సో.. కౌగిలింతలకు ముందు పర్మిషన్ తప్పనిసరి.