: యూపీలో కాంగ్రెస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ.. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ప్రియాంక నిర్ణయం!
యూపీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ప్రియాంక వాద్రాను ఎన్నికల ప్రచారంలో దింపి లబ్ధిపొందాలని భావించిన యూపీ కాంగ్రెస్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రియాంక ఆసక్తి చూపడం లేదు. ఈ దఫా ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్టు తెలిసింది. 2012 ఎన్నికల్లో అమేథీ, రాయబరేలీ పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రియాంక విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ కాంగ్రెస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. మొత్తం పది నియోజకవర్గాలకు గాను కేవలం రెండింటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐదేళ్లు గడిచినా యూపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం మారకపోవడంతోనే ప్రియాంక ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.