: నేనేమీ అమెరికా వదిలిపెట్టి పోను.. మీ ప్రతి అడుగులో ఉంటా.. వీడ్కోలు లేఖలో ఒబామా
అమెరికా అధ్యక్ష బాధ్యతలను నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బదిలీ చేసిన బరాక్ ఒబామా శుక్రవారం దేశ ప్రజలకు వీడ్కోలు సందేశం తెలుపుతూ లేఖ రాశారు. అమెరికాను విడిచి తానెక్కడికీ వెళ్లడం లేదని, దేశ ప్రజల ప్రతి అడుగులో తానుంటానని పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచి, మెరుగైన అధ్యక్షుడిగా తీర్చిదిద్దిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రజల మంచితనమే తనను ఎనిమిదేళ్లు నడిపించిందని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. ప్రజలే తనను మెరుగైన అధ్యక్షుడిగా మార్చారని పేర్కొన్నారు. నేనుగా కాకుండా మనంగా కలిసి వెళితే ఏదైనా సాధించవచ్చని లేఖలో ఒబామా పేర్కొన్నారు. అధ్యక్షుడిగా తాను నేర్చుకున్నది ప్రజల నుంచేనని తెలిపారు.
తన హయాంలో 1715 మంది ఖైదీలకు శిక్షలు తగ్గించినందుకు గర్వపడుతున్నానని అన్నారు. అమెరికా కాంగ్రెస్ అడ్డుకోకుంటే గ్వాంటనామో బే సైనిక జైలును మూసివేసేవాడినని పేర్కొన్న ఒబామా, అమెరికా జాతీయ జైళ్లలో మగ్గుతున్న 330 మంది ఖైదీల శిక్షలు తగ్గించాలన్న నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్న వ్యక్తి కొత్త అధ్యక్షుడి కోసం వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో లేఖ వదిలి వెళ్లడం సంప్రదాయంగా వస్తోంది.