: 'నా అధికారాన్ని మళ్లీ మీకే బదిలీ చేస్తున్నా.. జనవరి 20 చరిత్రలో నిలిచిపోతుంది'.. అధ్యక్షుడిగా ట్రంప్ తొలి ప్రసంగం
అమెరికా రాజ్యాంగాన్ని కాపాడతానని రెండు బైబిళ్లపై ప్రమాణం చేసిన ట్రంప్ తొలి ప్రసంగంతోనే అమెరికన్లను ఆకట్టుకున్నారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత అధ్యక్షుడిగా జాతినుద్దేశించి 16 నిమిషాలపాటు ప్రసంగించారు. వాషింగ్టన్ డీసీ నుంచి అధికారాన్ని మళ్లీ మీకే బదిలీ చేస్తున్నానని పేర్కొన్నారు. దేశమే అమెరిక్ల తొలి ప్రాధాన్యం కావాలని అన్నారు. ఐకమత్యంగా ఉంటే అమెరికాను ఎవరూ ఆపలేరని, అమెరికన్ల చేతుల మీదుగా దేశాన్ని పునర్నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. అందరం కలిసి దేశాన్ని మరోసారి బలోపేతం చేద్దామన్నారు. అమెరికా అమెరికన్లదేనని, అమెరికా గమ్యాన్ని అందరం కలిసి నిర్ణయిద్దామని 8 లక్షల మంది సమక్షంలో పేర్కొన్నారు. ప్రజలే పాలకులైన రోజుగా జనవరి 20 చరిత్రలో నిలిచిపోతుందని భావోద్వేగంగా అన్నారు. ఈ విజయం అమెరికన్లదేనని స్పష్టం చేశారు.
నేటి నుంచి ఒకటే దేశం, ఒకటే హృదయమని, ప్రతి నిర్ణయాన్ని అమెరికా కుటుంబాలు, కార్మికులకు లబ్ధి చేకూర్చేలా తీసుకుంటామని స్పష్టం చేశారు. శరీర రంగు ఏదైనా అందరిలోనూ దేశభక్తి ఉప్పొంగుతోందన్నారు. అందరం కలిసి అమెరికాను మారుద్దామని ట్రంప్ పిలుపునిచ్చారు. తన పాలనకు అమెరికా ఫస్ట్ అనేదే కీలక మంత్రమని పేర్కొన్న అధ్యక్షుడు ట్రంప్ దేశంలో ఇస్లామిక్ ఉగ్రవాదానికి స్థానం లేదన్నారు. భూమిపై నుంచి దానిని సమూలంగా నిర్మూలిస్తానని ప్రతిజ్ఞ చేశారు. అమెరికాలో గన్ కల్చర్, డ్రగ్స్ , నేరాలు, హింస ఇప్పటికిప్పుడే ఆగిపోవాలన్నారు.