: ఏమీ తెలియకుండానే సినిమా తీశానా?: మండిపడ్డ దర్శకుడు క్రిష్
'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాలో చరిత్రను వక్రీకరించారంటూ చరిత్రకారులు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో కల్పితాలు పెట్టుకోవచ్చని... కానీ, అదే చరిత్ర అంటే చూస్తూ ఊరుకోవాలా? అని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆ సినిమా దర్శకుడు క్రిష్ మండిపడ్డారు. తాను చేసిన ఓ గొప్ప ప్రయత్నాన్ని కించపరిచేలా వారు వ్యవహరిస్తున్నారని... అలాంటి వారి వ్యాఖ్యల పట్ల తాను స్పందించనని అన్నారు. తాను ఏమీ తెలియకుండానే కళ్లు మూసుకుని సినిమా తీయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్క్రిప్ట్ రాసేటప్పుడు ఐదు పుస్తకాలను చదివానని... వాటిలో పలు రకాలుగా శాతకర్ణి గురించి తెలిపారని... వాటన్నిటితో పాటు, చదువుకునే రోజుల్లో తాను చదువుకున్న దాన్ని కూడా మిళితం చేసి కథను తయారుచేసుకున్నానని చెప్పారు. తనను విమర్శించేవాళ్లవన్నీ నిరాధార ఆరోపణలని కొట్టి పారేశారు.
గౌతమీపుత్ర శాతకర్ణి తెలుగు చక్రవర్తుల్లో ఒకరని విశ్వనాథ సత్యనారాయణ చెప్పారని... వారి కన్నా తనను విమర్శించేవారు ఎక్కువా? అని ప్రశ్నించారు. నందమూరి తారక రామారావు కూడా ఈ సినిమా చేయాలనుకున్నారని... ఆయన నిజంగా తెలుగు చక్రవర్తి కాకపోతే ఎన్టీఆర్ ఆ సినిమా చేయాలనుకుంటారా? అని నిలదీశారు.