: సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు...ఎవరి పుట్టినరోజు అయినా అంతా కలిసి జరుపుకుంటాం: సీనియర్ నటుడు నరేష్
ప్రముఖ నటుడు నరేష్ పుట్టిన రోజు వేడుకలు ఈరోజు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని సూపర్ స్టార్ కృష్ణ నివాసంలో జరిగిన ఈ వేడుకలకు సినీ ప్రముఖులు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం నరేష్ మాట్లాడుతూ, ‘సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయనిర్మల గారు, మహేష్ బాబు, సుధీర్ బాబు ... ఇలా ఎవరి పుట్టిన రోజు అయినా అందరం కలిసి ఒక కళా కుటుంబంగా జరుపుకునే పండగ ఇది. సూపర్ స్టార్ కృష్ణ గారు సినీ రంగంలోకి ప్రవేశించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాకారుల ఐక్య వేదిక, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తరపున సన్మానం చేస్తున్నాము. ఈసారి, ప్రత్యేకంగా సీనియర్ ఫ్యాన్స్ కు మేము సన్మానం చేస్తున్నాము... ఇది మా కృతఙ్ఞత. ‘మీ కళారాధనకు మా పురస్కారాలు’ పేరుతో వారికి మెమొంటోలు బహూకరిస్తాము’ అని నరేష్ పేర్కొన్నారు. కాగా, ఈ వేడుకల్లో ప్రముఖ నటి, నరేష్ తల్లి విజయనిర్మల, సహజ నటి జయసుధ, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజా, అభిమానులు పాల్గొన్నారు.