: పెటా అవార్డును తీసుకున్నందుకు నేను చాలా సిగ్గు పడుతున్నా: హీరో ధనుష్ సంచలన వ్యాఖ్యలు
జల్లికట్టుకు మద్దతు పలుకుతున్న సినీ ప్రముఖుల జాబితా పెరుగుతోంది. ఇప్పటికే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ జల్లికట్టుకు తన మద్దతును ప్రకటించారు. ఇప్పుడు ఆయన బాటలోనే ఆయన అల్లుడు, యంగ్ హీరో ధనుష్ కూడా నడిచాడు. జల్లికట్టుకు మద్దతు పలికాడు. శాకాహారిని అయిన తనకు 2012లో పెటా సంస్థ 'హాటెస్ట్ వెజిటేరియన్' అవార్డు ఇచ్చిందని... ఆ అవార్డును స్వీకరించడం పట్ల తాను ఇప్పుడు చాలా సిగ్గుపడుతున్నానని చెప్పాడు.
తాను కానీ, తన కుటుంబ సభ్యులు కానీ పెటాలో భాగస్వాములం కాదని తెలిపాడు. తాను పెటా సభ్యుడిననంటూ వస్తున్న వార్తలన్నీ పుకార్లే అంటూ కొట్టిపారేశాడు. జల్లికట్టుపై నిషేధం ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాడు. జల్లికట్టును కొనసాగించేలా ప్రధాని మోదీ ఓ ఆర్డినెన్సును తీసుకురావాలని విన్నవించాడు. జల్లికట్టు కోసం శాంతియుతంగా, గౌరవప్రదంగా పోరాడుతున్న తమిళ యువతను కొనియాడాడు.