: నాగిరెడ్డీ! జగన్ నంద్యాలకు కచ్చితంగా వస్తారు!: భూమాకు అంబటి రాంబాబు జవాబు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి యత్నించిన విషయమై నంద్యాల ఎమ్మెల్యే, ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి నిన్న స్పందించిన విషయం తెలిసిందే. ఒక మహిళ అని కూడా చూడకుండా వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడికి యత్నించడం మంచి పద్ధతి కాదని, వైఎస్సార్సీపీ నేతలు నంద్యాల పర్యటనకు వచ్చినప్పుడు తాము ఇదే విధంగా ప్రవర్తిస్తున్నామా? అని భూమా నాగిరెడ్డి ప్రశ్నించడమే కాకుండా, 'ఈసారి జగన్ ని నంద్యాలలో పర్యటించమనండి' అంటూ భూమా సవాల్ విసిరారు.
దీనిపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఈ రోజు ఘాటుగా స్పందించారు. ‘మీరు మమ్మల్ని నంద్యాలకు రమ్మని సవాల్ చేశారు. జగన్ కచ్చితంగా నంద్యాల వస్తారు’ అని ఆయన సమాధానమిచ్చారు. 2015 డిసెంబర్ లో పంటకు నిప్పు పెట్టిన ఘటనలో ఇంతవరకూ ఒక్కరినీ అరెస్టు చేయలేదని, ఫ్యాన్సీ నెంబర్ కోసం టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అనుచరులు దౌర్జన్యానికి పాల్పడుతుంటే ఆ దృశ్యాలను చిత్రీకరించిన విలేకరిని అసభ్యపదజాలంతో దూషించారని, అలాంటి వారిపై కేసులు పెట్టకుండా ప్రజల తరపున నిలబడ్డ విపక్షనేతలను, కార్యకర్తలను వేధించడం దారుణమని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియలకు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి గెలవాలని అంబటి రాంబాబు సవాల్ విసిరారు.