: కర్ణాటక ముఖ్యమంత్రిని వెంటాడుతున్న 'కాకి'... ఈసారి రెట్ట వేసింది!
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కాకులు పగబట్టి ఉన్నాయి. నిన్నగాక మొన్న సిద్ధరామయ్య కారుపై కూర్చుని ఓ కాకి చాలా హడావుడి చేసింది. దీన్ని అపశకునంగా భావించిన ఆయన... ఏకంగా కారునే మార్చేశారు. ఇప్పుడు తాజాగా ఓ కాకి ఆయనపై రెట్ట వేసింది. ఈ ఘటన కేరళలోని కాసరగోడు సమీపంలో ఉన్న మంజేశ్వర్ లో జరిగింది. ఈ ప్రాంతం మంగళూరుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మంజేశ్వర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వేదికపై ఉన్న సిద్ధరామయ్యపై కాకి రెట్ట వేసింది. ఆయన దుస్తులపై రెట్ట పడింది. వెంటనే పక్కనే ఉన ఓ ఎమ్మెల్యే ఆ రెట్టను తుడిచివేశారు. అదే సమయంలో వేదికపై కాంగ్రెస్ ఎంపీ వీరప్ప మొయిలీ, మంత్రి రమానాథ రై కూడా ఉన్నారు. ఆ తర్వాత అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది కాకిని తరిమివేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఇది జరిగిన తర్వాత కాకి రెట్ట శుభ శకునమా? కాదా? అంటూ వేదికపై తన సహచరులతో సిద్ధరామయ్య చర్చించడం కనిపించింది.