: మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోం: అంబటి రాంబాబు హెచ్చరిక
ఎమ్మెల్యే అఖిల ప్రియపై దాడి కేసులో వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్టు చేయడంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జరగని ఘటనను జరిగినట్టుగా టీడీపీ నేతలు సృష్టించారని, అఖిల ప్రియపై దాడి జరిగినట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతు సమస్యలను పక్కదారి పట్టించేందుకే చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని, ఘటన జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నానని, అఖిల ప్రియపై ఎలాంటి దాడి, గొడవ జరగలేదని అన్నారు.
అసలు, దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని, అలాంటి నైజం తమది కాదని, 8 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గతంలో అధికారులపై దాడి చేసినా, ఎమ్మెల్సీ అన్నం సతీష్ టూరిజం సిబ్బందిపై దాడి చేసినా, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కాంట్రాక్టర్లపై దాడికి పాల్పడినప్పటికీ వారిపై మాత్రం ఎటువంటి కేసులు పెట్టలేదని ఈ సందర్భంగా అంబటి రాంబాబు విమర్శించారు.