: ఎస్సై పిలుస్తున్నారంటూ యువకుడిపై దాడి.. రూ.13.5 లక్షల దోపిడీ
ఎస్సై పిలుస్తున్నారంటూ ఓ వ్యక్తిని బెదిరించిన ఇద్దరు యువకులు అతడి నుంచి రూ.13.5 లక్షలు దోచుకున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కడపకు చెందిన అమీర్ బాషా నగల వ్యాపారి. నగల కొనుగోలు కోసం బుధవారం రాత్రి రైలులో బయలుదేరిన ఆయన గురువారం తెల్లవారుజామున రేణిగుంట రైల్వే స్టేషన్‌లో దిగి, చెన్నై వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో అతడి వద్దకు వచ్చిన 30 ఏళ్ల వయసున్న ఇద్దరు యువకులు తాము పోలీసులమని చెప్పి పరిచయం చేసుకున్నారు.
ఎస్సై పిలుస్తున్నారంటూ స్టేషన్ బయటకు తీసుకెళ్లిన వారు బైక్‌పై ఎక్కించుకుని ఐదుకళ్ల వారధి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ అమీర్‌కు కత్తి చూపించి చంపేస్తామని బెదిరించారు. అతడి వద్ద ఉన్న రూ.13.50 లక్షలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు రేణిగుంట రైల్వే పోలీసులతోపాటు రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే కేసు తమ పరిధిలోకి రాదని పోలీసులు చెబుతున్నారని అమీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నాడు.