: గల్ఫ్‌లో తెలంగాణ హోంమంత్రి నాయినికి చేదు అనుభవం.. చేసేది లేక అల్లుడితో కలిసి విహారానికి!
తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి గల్ఫ్‌లో చేదు అనుభవం ఎదురైంది. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగ వీసాల కోసం ఐదు రోజుల పర్యటనలో భాగంగా నాయిని గురువారం ఖతర్ చేరుకున్నారు. అదే రోజు ఆయన భారత రాయబారితో సమావేశం కావాల్సి ఉంది. అయితే మంత్రి పర్యటనకు సంబంధించి తనకు సమాచారం లేకపోవడంతో ఆయన మంత్రిని కలవలేకపోయారు. దీంతో ఏం చేయాలో తెలియని నాయిని బస చేసిన హోటల్లోనే అందుబాటులో ఉన్నకొన్ని సంస్థల ప్రతినిధులతో మొక్కుబడి సమావేశం నిర్వహించి మమ అనిపించారు.
అనంతరం అల్లుడితో కలిసి పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వెళ్లిపోయారు. తెలంగాణ యువతకు గల్ఫ్‌లో విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో నాయిని సారథ్యంలోని ఐదుగురు సభ్యుల బృందం ఖతర్, బెహ్రయిన్, కువైట్ దేశాల్లో పర్యటిస్తోంది. అయితే అక్కడి తెలంగాణ సంఘాల్లో ఉన్న అంతర్గత విభేదాల కారణంగా మంత్రి పర్యటన విషయమై ఈ మూడు దేశాల్లోని సంఘాలకు సరైన సమాచారం అందలేదు. దీంతో మంత్రి పర్యటన ఆగమైంది. కువైట్, బెహ్రయిన్‌లోనూ మంత్రికి ఇలాంటి అనుభవమే ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది.