: చంద్రబాబు అనుభవమంత లేదు నీ వయసు.. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికొస్తా, చర్చకు సిద్ధమా?: జగన్‌కు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ సవాల్
ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ విరుచుకుపడ్డారు. నిద్ర మేల్కొన్నప్పుడు లోకాన్ని చూసే నీకు అభివృద్ధి గురించి ఏం తెలుసని మండిపడ్డారు. గురువారం మందడంలో రైతుల ప్లాట్ల కేటాయింపు కార్యక్రమంలో పాల్గొన్న శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం వల్ల అభివృద్ది జరుగుతోందని ప్రజలే చెబుతున్నారని అన్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని ఏడు నెలల్లో పూర్తి చేశామన్నారు. ప్లాట్లలో రోడ్డు నిర్మాణం జరుగుతోందన్నారు. ఇవన్నీ జగన్‌కు కనిపించడం లేదన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనభవమంత కూడా జగన్ వయసు లేదని, అసలు ఆయనకు, జగన్‌కు పొంతనేంటని అన్నారు. జగన్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి చర్చిద్దామని సవాల్ విసిరారు. దమ్ముంటే చర్చకు రావాలన్నారు. నిద్రలో ఎప్పుడో ఓసారి మేల్కొనే జగన్ రాజధానిలో అభివృద్ధి జరగలేదని చెప్పగలరా? అని శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు.