: ప్రేమికుడితో కలిసి యువతి కిడ్నాప్ డ్రామా.. కన్నవారికే ముచ్చెమటలు పట్టించిన కూతురు
ప్రేమ పేరుతో విలాసాలకు అలవాటు పడిన ఓ యువతి డబ్బుల కోసం ప్రియుడితో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడింది. కన్నతల్లిదండ్రులకే ముచ్చెమటలు పట్టించింది. తల్లిదండ్రులు భయంతో పోలీసులను ఆశ్రయించడంతో కుమార్తె బాగోతం వెలుగుచూసింది. హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీస్ బాస్ ఎం.మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం..
నగర శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బేగంబజారుకు చెందిన యువతి(19) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న అభిషేక్(20)తో ప్రేమలో పడింది. ప్రేమ పేరుతో ఇద్దరూ జల్సాలకు అలవాటు పడ్డారు. యువతికి తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ మనీ సరిపోకపోవడంతో జల్సాలకు కష్టమైంది. ఇదే విషయాన్ని తరచూ ప్రియుడితో చెప్పి ఆవేదన చెందేది. బాగా డబ్బు సంపాదించి విదేశాలకు వెళ్లాలని ఉందని ప్రియుడితో చెప్పేది. తన తండ్రి వ్యాపారవేత్త అని తమ వద్ద బోల్డంత డబ్బు ఉందని తెలిపింది. కిడ్నాప్ డ్రామా ఆడి తండ్రి నుంచి డబ్బులు కొట్టేద్దామంటూ ప్రియుడికి వివరించింది.
అనుకున్నట్టే ఓ ఫైన్ డే యువతి తల్లిదండ్రులకు అభిషేక్ ఫోన్ చేసి 'నీ కూతురును కిడ్నాప్ చేశా.. ఆమె ప్రాణాలతో కావాలంటే రూ.30 లక్షలు ఇవ్వాలి' అంటూ హెచ్చరించాడు. దీంతో భయపడిన యువతి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో కిడ్నాప్ గుట్టు రట్టయింది. ప్రియురాలి సలహాతోనే కిడ్నాప్ డ్రామా ఆడినట్టు అభిషేక్ పోలీసులకు తెలిపాడు.