: అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో పంజాబ్ సీఎం కుటుంబానికి సంబంధాలు!: ప్రతిపక్షాల ఆరోపణలు
పంజాబ్ యువత ఇప్పుడు మత్తులో జోగుతోంది. డ్రగ్స్ కోసం రక్తాన్ని కూడా అమ్ముకునేందుకు ముందుకొస్తోంది. అంతేకాదు అందుకోసం ఎన్నో దారుణాలకు కూడా ఒడిగడుతోంది. మత్తుకు బానిసైన యువత అదే మత్తులో ప్రాణాలు కోల్పోతున్నారు. గత పదేళ్లలో ఇది మరింత ఎక్కువైంది. మాదక ద్రవ్యాల భూతం రాష్ట్రంలో జడలు విప్పి యువత జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాలతో ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కుటుంబానికి, ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులకు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.
డ్రగ్స్ సరఫరాలో అన్ని పార్టీల నాయకుల పాత్ర ఉందని నిఘా విభాగం గతంలోనే చెప్పడం ఆరోపణలకు మరింత ఊతమిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు విదేశాల్లో స్థిరపడడంతో ప్రజల వద్ద సంపద గణనీయంగా పెరిగింది. దీంతో మాదక ద్రవ్యాల వ్యాపారం జోరందుకుంది. రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరాపై పదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ హయాంలో రూపొందించిన 4 పేజీల నివేదిక ఆ తర్వాత రికార్డుల నుంచి మాయం కావడం బాదల్ ప్రభుత్వంపై అనుమానాలకు తావిస్తోంది.
ప్రస్తుతం పంజాబ్‌లోని 70 శాతం ఇళ్లలో ఒక్కరైనా డ్రగ్స్ బారిన పడినవారు ఉన్నారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదట దేశీయ మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువత క్రమంగా హెరాయిన్, కొకైన్, సింథటిక్ డ్రగ్స్‌వైపు వెళ్తున్నారు. మత్తు పదార్థాల స్వాధీనం, అరెస్టులు, కేసులు, మరణాల్లో పంజాబ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్టు వివిధ నివేదికలు చెబుతున్నాయి. డ్రగ్స్ ముఠాలకు అధికార అకాలీదళ్ ప్రభుత్వ అండదండలు ఉన్నాయని విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రం ఎన్నికలకు వెళ్తున్న వేళ ఇప్పుడీ అంశం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు డ్రగ్స్ నిర్మూలనను తమ ఎజెండాలో చేర్చడం గమనార్హం. అధికార అకాలీదళ్-బీజేపీ సంకీర్ణం మాత్రం రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడి కావడానికి గత కాంగ్రెస్ పాలనే కారణమని ఆరోపిస్తోంది.