: వడ్డీరేట్ల తగ్గింపు... ఖాతాదారులకు హెచ్డీఎఫ్సీ తీపికబురు
ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న హెచ్‌డీఎఫ్‌సీ తమ ఖాతాదారులకు తీపికబురు అందించింది. తమ బ్యాంకులో ప్రస్తుత కస్టమర్లు తీసుకున్న రుణాలపై వడ్డీరేట్లపై 15 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు పేర్కొంది. 75 లక్షల రూపాయల లోపు రుణం తీసుకున్న మహిళా రుణగ్రహీతలు గృహ రుణాలపై 8.65 శాతం వడ్డీరేటు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. ఇతర రుణగ్రహీతలు 8.70 శాతం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఇక రూ.75 లక్షల కన్నా ఎక్కువ తీసుకున్న మహిళలు 8.70 శాతం (ఏడాదికి), ఇతరులు 8.75 శాతం (ఏడాదికి) చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. ఈ వడ్డీరేట్ల తగ్గింపును తమ ప్రస్తుత ఖాతాదారులందరికీ అందిస్తున్నట్లు పేర్కొంది. హెచ్‌డీఎఫ్‌సీ ఇటీవలే కొత్త కస్టమర్లకు రుణ రేటును 45 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఈ సదుపాయం ఎన్ఐఆర్లతో పాటు పీఐఓలకు వర్తిస్తుందని చెప్పింది.