: రాహుల్ గాంధీకి కొత్త చొక్కా కొనిపెడతామంటున్న కర్ణాటక యువ మోర్చా!
తన కుర్తా జేబు చిరిగిపోయిందని, అయినా తాను పట్టించుకోనని, మరి పేదల ప్రతినిధినని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ చిరిగిన బట్టలు వేసుకోవడం ఎప్పుడైనా చూశారా? అంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ యువ మోర్చా తాజాగా స్పందించింది. ఆయనకు కొత్త చొక్కా కొని ఇవ్వాలని యువ మోర్చా కార్యకర్తలు నిర్ణయించారు. ఈ సందర్భంగా యువ మోర్చా నేత శ్రీనివాస్ మాట్లాడుతూ, ‘నలభై రోజుల క్రితం రాహుల్ గాంధీ బ్యాంకు నుంచి రూ.4000 మాత్రమే విత్ డ్రా చేసుకున్నారు. ఆయన మళ్లీ బ్యాంక్ కు వెళ్లలేదు. కొత్త చొక్కా కొనుక్కునేందుకు ఆయన వద్ద డబ్బులు లేవు. అందుకే, మేము కొత్త చొక్కా కొని ఆయనకు పంపించాలని నిర్ణయించాము’ అని అన్నారు.