: తండ్రి వచ్చాడన్న సంతోషం పట్టలేక ఆగిన 'యువ' గుండె!
పట్టలేని సంతోషం వచ్చినా, దుఃఖం కలిగినా మన గుప్పెడంత గుండె తట్టుకోలేదని నిరూపితమైంది. కొల్హాపూర్ లోని సాజిద్ మక్వానా (27) తండ్రి హసన్ ఒక కేసులో జీవిత ఖైదు పడడంతో జైలుకెళ్లాడు. అయితే, ఆయన ఏనాడూ పెరోల్ తీసుకోలేదు. కొలబా సెంట్రల్ జైలులో శిక్షను అనుభవించాడు. కొడుకు సాజిద్ పెరిగి పెద్దవాడై ముంబైలోని అంధేరీలో డ్రైవింగ్ స్కూల్ పెట్టి ఆనందంగా ఉన్నాడు. త్వరలోనే వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. ఇంతలో తండ్రి విడుదల కానున్నాడన్న శుభవార్త విన్నాడు. దీంతో ఆ తరువాత శుభకార్యం పెట్టుకుందామని భావించాడు.
ఇంతలో 23 ఏళ్ల శిక్ష అనంతరం హసన్ జైలు నుంచి విడుదలయ్యాడు. తండ్రి విడుదలవుతుండడంతో తండ్రిని ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన సాజిద్... హసన్ జైలుకు సెల్యూట్ చేసి రోడ్డు దాటుతుండడంతో ఆనందం పట్టలేకపోయాడు. ఎంతగానో ఎదురు చూసిన తండ్రి బయటకు రావడంతో సంతోషంతో కేరింతలు కొట్టాడు. తండ్రితో మాట్లాడుతుండగా గుండెనొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతనిని ఆసుపత్రికి తరలించగా, కార్డియాక్ అరెస్టుతో అప్పటికే మృతి చెందాడని తెలిపారు. దీంతో ఆ కుటుంబాన్ని అలముకున్న ఆనందం విషాదంగా మారింది.