: జియో కస్టమర్లకు మరో తీపి కబురు.. 5జీ సేవలకు సిద్ధమవుతున్న సంస్థ!
అరంగేట్రంతోనే అదరగొట్టిన రిలయన్స్ జియో సంచలన ప్రకటనలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ ప్రత్యర్థి కంపెనీలను గుక్క తిప్పుకోనివ్వకుండా చేస్తోంది. తాజాగా మరోమారు ఇతర కంపెనీలను దెబ్బ కొట్టే వ్యూహంతో ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది. జియో కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు త్వరలో 5జీ సేవలను అందించేందుకు సమాయత్తమవుతోంది.
అంతేకాదు 5 జీ స్మార్ట్‌ఫోన్లను కూడా మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్టు సమాచారం. అదే జరిగితే ఇతర టెలికం కంపెనీలు కుదేలవక తప్పదు. 5 జీ సర్వీసులతోపాటు జియో టీవీ అనే కొత్త సర్వీస్‌ను కూడా తెచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. డీటీహెచ్ సర్వీస్ అయిన దీని ద్వారా అతి తక్కువ ధరతో 360కి పైగా చానల్స్‌ను చూడవచ్చని రిలయన్స్ ప్రతినిధులు తెలిపారు. ఈ సర్వీస్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న విషయాన్ని చెప్పనప్పటికీ నార్మల్ టీవీ నుంచి స్మార్ట్ టీవీకి మారేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.