: అనిల్ అంబానీ కోర్కెల చిట్టా విని అవాక్కయిన ఏపీ ప్రభుత్వం!
అనిల్ అంబానీ సారథ్యంలోని అడాగ్ గ్రూప్ కోర్కెలు విని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవాక్కయింది. విశాఖపట్టణంలో రూ.5 వేల కోట్లతో నౌకాదళానికి అవసరమైన యుద్ధ పరికరాల కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామంటూ గతేడాది ప్రకటించిన అడాగ్ గ్రూప్ ప్రభుత్వం ముందు గొంతెమ్మ కోర్కెలు ఉంచింది. తాము నిర్మించే కర్మాగారానికి తొలుత వెయ్యి ఎకరాలు కావాలన్న అడాగ్ ఆ తర్వాత దానిని రెండు వేల ఎకరాలకు పెంచింది. అది కూడా ఉచితంగా కావాలంటూ ప్రతిపాదించింది. ఏడాదికి ఎకరానికి రూపాయి అద్దె చొప్పున 99 ఏళ్లపాటు లీజుకు ఇవ్వాలని కోరింది.
అయితే, ఇక్కడితో కోర్కెల చిట్టా అయిపోలేదు. తాము కోరినట్టు భూమి ఇస్తే మొదట రూ.5వేల కోట్లు పెట్టుబడి పెడతామని పేర్కొన్న సంస్థ అందులో 20 శాతం పెట్టుబడి రాయితీ కావాలని మరో మెలిక పెట్టింది. అంటే వెయ్యి కోట్ల రూపాయలను ప్రభుత్వమే ఎదురు సమర్పించుకోవాలన్న మాట. వీటితోపాటు స్టాంప్ డ్యూటీ నుంచి అన్ని రకాల పన్ను మినహాయింపులు కావాలని డిమాండ్ చేసింది. యూనిట్ విద్యుత్‌ను రూ.2.50 చొప్పున 25 ఏళ్లపాటు ఇవ్వాలని, 25 ఏళ్లపాటు నీటిని ఉచితంగా సరఫరా చేయాలంటూ గొంతెమ్మ కోర్కెలు కోరింది.
తాము కోరిన సౌకర్యాలు కల్పిస్తే రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ పేరుతో కర్మాగారం ప్రారంభించి ప్రత్యక్షంగా మూడువేల మందికి, పరోక్షంగా ఆరువేల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. అంతేకాదు కొత్తగా తీసుకునే ఉద్యోగులకు శిక్షణ కాలంలో తొలి రెండు నెలల జీతాన్ని ప్రభుత్వమే చెల్లించాలని ప్రతిపాదనల్లో పేర్కొంది.
రిలయన్స్ కోర్కెల చిట్టా చూసి ఏపీ సర్కారు విస్తుబోయింది. అధికారులు అవాక్కయ్యారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇంకా ఆశావహ దృక్పథంతోనే ఉంది. కంపెనీ ప్రతిపాదనలపై పరిశీలనకు ఓ కమిటీని నియమించింది. అచ్యుతాపురం మండలంలో ఎకరా భూమిని రూ.17.5 లక్షల చొప్పున ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొంది. ప్రాజెక్టు పట్ల ఆసక్తి కనబరుస్తున్న ప్రభుత్వం వీలైనంత హేతుబద్ధంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకుంది. వ్యాట్, సీఎస్టీ, జీఎస్టీలపై ఏడేళ్ల వరకు 100 శాతం రాయితీ ఇచ్చేందుకు అంగీకరించింది.
.