: కండలు చూపించిన లేడీ బాడీ బిల్డర్ కు జైలు శిక్ష!
ఇరాన్ అనగానే గుర్తొచ్చేది అక్కడ కఠినంగా అమలయ్యే షరియత్ చట్టాలు. ఈ చట్టం ప్రకారం, మహిళలు తమ కాళ్లూ చేతులు కనిపించేలా దుస్తులు కూడా ధరించకూడదు. అటువంటిది, శరీరభాగాలు కనిపించేలా ఇరాన్ లో మహిళలు దుస్తులు ధరిస్తే ఊరుకుంటారా? అందుకు తాజా ఉదాహరణ ఈ సంఘటన.
ఇరాన్ కు చెందిన ఒక మహిళా బాడీ బిల్డర్, తన కండలు కనపడేలా ఫొటోకు పోజ్ ఇచ్చింది. అంతేకాదు, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన అక్కడి అధికారులు, ఆమెకు 50 వేల యూఎస్ డాలర్లను జరిమానాగా విధించారు. అయితే, సదరు జరిమానా కట్టేందుకు అంత సొమ్ము ఆమె వద్ద లేకపోవడంతో జైలు శిక్ష అనుభవిస్తోంది.
ఈ నేపథ్యంలో అక్కడి జిమ్ సెంటర్లకు పోలీసులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. మహిళల కోసం రహస్యంగా జిమ్ సెంటర్లు నిర్వహిస్తే, కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. కాగా, ఈ వార్తను ఇరానీ మీడియా ప్రసారం చేసింది. అయితే, ఆ లేడీ బాడీ బిల్డర్ పేరును మాత్రం వెల్లడించలేదు.