: 3,500 కోసం వెళ్తే... నోట్ల వర్షం కురిపించిన ఏటీఎం!
రాజస్థాన్ లోని టోంక్ లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఈ ప్రాంతానికి చెందిన జితేష్ దివాకర్ అవసరం నిమిత్తం 3,500 రూపాయలు తీసుకునేందుకు దగ్గర్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఎంకు వెళ్లారు. ఏటీఎంలో డెబిట్ కార్డు పెట్టి, 3,500 రూపాయలు డ్రా చేశారు. అయితే ఆయన ఊహించని విధంగా ఏటీఎం నుంచి నోట్ల వర్షం కురిసింది. ఏకంగా 70 వేలు వచ్చాయి. దీంతో దివాకర్ ఆశ్చర్యపోయాడు. అయితే, నిజాయతీపరుడైన దివాకర్ తన తండ్రి, బాబాయ్ తో కలిసి వెళ్లి బ్యాంకు మేనేజర్ కు విషయం వివరించాడు. దీంతో బ్యాంకు అధికారులు జరిగిన పొరపాటు గ్రహించారు. అంతకు ముందు ఈ ఏటీఎంలో 6.76 లక్షల రూపాయలు నింపినట్లు బ్యాంకు మేనేజర్ చెప్పారు.
సాంకేతిక తప్పిదం కారణంగా 100 నోట్ల స్థానంలో 2 వేల నోట్ల రూపాయలు వచ్చాయని ఆయన వెల్లడించారు. దీనిపై సాంకేతిక నిపుణులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామని ఆయన అన్నారు. దివాకర్ కంటే ముందు ఆ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసిన వారి వివరాలు పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. దీనిపై ఏటీఎం ఎదురుగా ఉన్న షాప్ యజమాని మాట్లాడుతూ, ఏటీఎంలో డబ్బులు డ్రా చేసిన వారు నవ్వుతూ బయటకు వచ్చేవారని అన్నాడు. చాలా మంది డబ్బులు డ్రా చేసినప్పటికీ కేవలం దివాకర్ మాత్రమే ఫిర్యాదు చేయడం విశేషమని వారు వెల్లడించారు.