: భాగ్యం ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఆరోగ్యం వస్తుందన్న గ్యారంటీ లేదు!: వెంకయ్యనాయుడు
ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం వస్తుందని, కానీ, భాగ్యం ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఆరోగ్యం వస్తుందన్న గ్యారంటీ మాత్రం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. తిరుపతి స్విమ్స్ లో ఆరు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, 'ఆరోగ్యం చాలా ముఖ్యమైన విషయం. మన జీవన విధానం, అలవాట్లు, రుచులు-అభిరుచులు, వృత్తులు-ప్రవృత్తులు మారాయి. ఏం తింటున్నామో మనకే తెలియదు. బర్గర్లు.. పిజ్జాలు.. ఇంకేమన్న ఉంటే అవీ తింటున్నాం. మన పూర్వీకులు మనకు అందించిన వారసత్వాన్ని మనం మర్చిపోయాం. అందుకే మనకు కొత్త సమస్యలు వస్తున్నాయి' అన్నారు.
అన్నింటి కంటే మన లైఫ్ స్టైల్ చాలా ముఖ్యమని, మన జీవన పద్ధతి సరిగా ఉంటే, శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం వస్తాయని, ఆరోగ్యం మహాభాగ్యంగా తయారవుతుందని అన్నారు. ఆరోగ్య శాఖకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, పేదలకు వైద్యం, విద్య, ఇళ్లు, బీమా సౌకర్యం కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని అన్నారు. దేశంలో ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య మరింతగా పెరగాల్సిన అవసరముందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు అన్నారు.