: ఆ ధైర్యంతోనే రెండు పెద్ద సినిమాల మధ్య 'శతమానంభవతి' విడుదల చేశా: దిల్ రాజు
తన తాజా చిత్రం 'శతమానం భవతి' హిట్ కావడంతో ఆ సినీ నిర్మాత దిల్ రాజు ఫుల్ జోష్ లో ఉన్నారు. సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని... ఓ కుటుంబ కథా చిత్రానికి ఇలాంటి కలెక్షన్లు వస్తుండటం ఇటీవలి కాలంలో తాను చూడలేదని దిల్ రాజు అన్నారు. సినిమాకు వస్తున్న కలెక్షన్లు ఓ మ్యాజిక్ అని తెలిపారు. కేవలం మౌత్ పబ్లిసిటీ వల్లే తమ సినిమా చూడ్డానికి కుటుంబాలు తరలి వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
ఓవర్సీస్ లో కూడా భారీ స్పందన వస్తోందని... మిలియన్ డాలర్ల మార్క్ చేరుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలుత 250 థియేటర్లలో దీనిని విడుదల చేశామని... ఇప్పుడు వాటి సంఖ్య 300కు చేరుకుందని తెలిపారు. రెండు పెద్ద సినిమాల మధ్య విడుదల చేయడానకి... సినిమాపై తనకున్న నమ్మకమే కారణమని దిల్ రాజు తెలిపారు. కథాంశంలో సంక్రాంతి ఉందని... అందువల్లే సంక్రాతికి విడుదల చేయడమే అర్థవంతంగా ఉంటుందని భావించానని చెప్పారు.
సినిమా చూసిన తర్వాత ఓ ఎమ్మెల్యే తనకు ఫోన్ చేశారని... 15 నిమిషాల పాటు సినిమా గురించే మాట్లాడారని ఆనందంగా చెప్పారు. రెండు పెద్ద సినిమాలతో పాటు తమ సినిమా కూడా విజయవంతంగా ఆడుతున్నందుకు చెప్పలేనంత ఆనందంగా ఉందని తెలిపారు. తమ కుటుంబాలన్నింటికీ ప్రసాద్ థియేటర్ లో ప్రివ్యూ వేశామని చెప్పారు. తన అన్నయ్య నరసింహారెడ్డికి ఏ సినిమా ఓ పట్టాన నచ్చదని... కానీ 'శతమానం భవతి' చూసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారని... చాలా బాగుందంటూ కాంప్లిమెంట్ ఇచ్చారని అన్నారు.