: కోహ్లీ దగ్గర బ్యాటింగ్ పాఠాలు నేర్చుకుంటానంటున్న జోరూట్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని బ్యాటింగ్ చిట్కాలు అడుగుతానని ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ తెలిపాడు. సచిన్, ద్రవిడ్, పాంటింగ్, కలిస్ వంటి దిగ్గజాలు రిటైర్ అయిన తరువాత భవిష్యత్ క్రికెట్ ను కోహ్లీ, విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జో రూట్ లు ఏలుతారంటూ పరిశీలకులు చెబుతుంటారు. వారు చెప్పినట్టే ఈ నలుగురూ క్రికెట్ లో తమ దేశాల పరువుప్రతిష్ఠలు ఇనుమడింపజేస్తున్నారు. అయితే ఈ నలుగురిలో కోహ్లీ కాస్త ఎక్కువ అని అందరూ అంగీకరిస్తారు. కోహ్లీ ఫాం, ఆడే విధానం ఈ ముగ్గుర్నీ దాటేసింది.
ఈ నేపథ్యంలో పూణేలో ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ ఆటతీరును దగ్గర్నుంచి గమనించిన రూట్ మాట్లాడుతూ, కోహ్లీ అద్భుతమైన ఆటగాడని కితాబునిచ్చాడు. ఛేజింగ్ లో విరాట్ ను మించినవారు లేరని అన్నాడు. ఈ విషయం అతని సెంచరీలు చెబుతాయని చెప్పాడు. ఛేజింగ్ లో అతను 15 సెంచరీలు సాధించగా, ఇంచుమించు అన్ని మ్యాచుల్లో జట్టు విజయం సాధించిందని రూట్ తెలిపాడు. 'ఈ గణాంకాలు చాలు, కోహ్లీ ఎలాంటి ఆటగాడో చెప్పడానికి' అని రూట్ పేర్కొన్నాడు. తనకు అవకాశం రాలేదు కానీ, వస్తే కోహ్లీని బ్యాటింగ్ లో చిట్కాలు అడుగుతానని రూట్ గార్డియన్ పత్రికతో అన్నాడు.