: హిజ్రాలు బిచ్చమెత్తుకుంటున్నారు.. వారికి పెన్షన్ ఇవ్వాలి: కొండా సురేఖ
తెలంగాణ అసెంబ్లీలో తొలిసారిగా హిజ్రాల అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశాన్ని టీఆర్ఎస్ నేత కొండా సురేఖ ఈరోజు ప్రస్తావించారు. హిజ్రాలను సమాజం మనుషులుగా చూడటం లేదని, వారిలో పెద్ద చదువులు చదువుకున్న వారూ ఉన్నారని అన్నారు. అయితే, వారికి ఉద్యోగాలు లభించకపోవడంతో బిచ్చమెత్తుకుని జీవితాలు గడుపుతున్నారన్నారు. హిజ్రాలను ఒంటరి స్త్రీలుగా గుర్తించి వారికి పెన్షన్ ఇవ్వాలని, జీవనోపాధి కల్పించాలని ఆమె కోరారు. ఎన్నికల్లో పోటీ చేసే ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం హిజ్రాలు కూడా పనిచేస్తుంటారనే విషయాన్ని సురేఖ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా, ఈ విషయమై సురేఖ చేసిన విజ్ఞప్తిపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతానని ఆయన హామీ ఇచ్చారు.