: బీజేపీలో చేరిన ఎన్డీ తివారీ... అప్పుడు తన కొడుకే కాదన్న రోహిత్ కి ఇప్పుడు టికెట్ అడిగిన వృద్ధనేత!


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయం కండువా కప్పుకున్నారు. తన కుమారుడు రోహిత్ శేఖర్ తో కలసి అమిత్ షాను కలిసిన ఆయన... తన కుమారుడికి కూడా బీజేపీ సభ్యత్వం ఇప్పించారు. ఉత్తరప్రదేశ్ నుంచి కానీ, ఉత్తరాఖండ్ నుంచి కానీ తన కుమారుడికి బీజేపీ టికెట్ ఇప్పించాలనేది ఆయన తాపత్రయం.

వాస్తవానికి రోహిత్ శేఖర్ ను తివారీ తన కుమారుడే కాదని గతంలో వాదించారు. రోహిత్ తల్లి ఉజ్వల శర్మతో తనకు ఎలాంటి సంబంధం లేదని... రోహిత్ కు తాను తండ్రిని కాదని అప్పట్లో ఆయన నొక్కి చెప్పారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. అయితే, ఈ విషయానికి సంబంధించి రోహిత్ కోర్టు మెట్లు ఎక్కాడు. డీఎన్ఏ పరీక్షలు చేయించాలని కోర్టులో వాదించాడు.

ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో డీఎన్ఏ పరీక్షలకు ఒప్పుకున్నాడు తివారీ. డీఎన్ఏ పరీక్షలో రోహిత్ తండ్రి తివారీనే అని తేలింది. ఆ తర్వాత ఆయన దిగివచ్చారు. 2014 మే 4వ తేదీన మీడియా సమావేశం పెట్టి, రోహిత్ తన కుమారుడే అని ప్రకటించారు. ఇప్పుడు తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం తివారీ తాపత్రయపడుతున్నారు. తన కుమారుడికి టికెట్ ఇవ్వడానికి సమాజ్ వాదీ పార్టీ నిరాకరించడంతో... ఆయన బీజేపీలో చేరారు. మరి, రోహిత్ కు బీజేపీ టికెట్ ఇస్తుందో? లేదో? వేచి చూడాలి.  

  • Loading...

More Telugu News