: అప్పట్లో అత్యంత అవమానకర పరిస్థితుల్లో తప్పుకున్న ఏపీ మాజీ గవర్నర్ ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నర్ గా పనిచేసి, అత్యంత అవమానకర పరిస్థితుల్లో పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎన్డీ తివారీ బీజేపీలో చేరుతున్నట్టు సమాచారం. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా గతంలో తివారీ పనిచేశారు. తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవడానికే బీజేపీవైపు తివారీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. తన కుమారుడికి రాజకీయాల్లో సముచిత స్థానం ఉండాలని తివారీ ఆశిస్తున్నారు.
అయితే, యూపీ ఎన్నికల్లో తన కుమారుడు రోహిత్ తివారీకి సమాజ్ వాదీ పార్టీ టికెట్ ఇస్తుందని తివారీ భావించారు. కానీ, రోహిత్ కు టికెట్ ఇవ్వడానికి ఎస్పీ ససేమిరా అంటోందని, అందుకే ఆయన బీజేపీవైపు అడుగు వేస్తున్నారని చెబుతున్నారు. యూపీ కాకపోతే ఉత్తరాఖండ్ లో అయినా తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. బీజేపీ ఇంకా తన అభ్యర్థులను ప్రకటించకపోవడంతో... తన కుమారుడికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ఆయన ఆశిస్తున్నారు.
మరోవైపు, ఏపీ గవర్నర్ గా పనిచేస్తున్నప్పుడు రాజ్ భవన్ లో అమ్మాయిలతో తివారీ రాసలీలలకు సంబంధించిన వీడియోలు లీక్ కావడంతో... ఆయన అత్యంత అవమానకర పరిస్థితిలో గవర్నర్ పదవికి రాజీనామా చేశారు.