: డీఎల్ రవీంద్రారెడ్డిని కలిసిన వైఎస్ వివేకా... మారుతున్న కడప రాజకీయం!
కడప జిల్లా రాజకీయ ముఖచిత్రం శరవేగంగా మారుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. జగన్ కు బద్ధ శత్రువుగా భావించే డీఎల్ రవీంద్రారెడ్డి వైకాపాలో చేరనున్నట్టు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, ఆయన్ను వైఎస్ వివేకానందరెడ్డి స్వయంగా కలిసినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా తరఫున బరిలోకి దిగనున్న వైఎస్ వివేకా, మైదుకూరు నియోజకవర్గంలో తనకు మద్దతివ్వాలని డీఎల్ ను కోరి, ఆయన్నుంచి హామీని పొందారని సమాచారం.
మైదుకూరు ప్రాంతంలో పట్టున్న నేతల్లో ఒకరైన డీఎల్ తనకు మద్దతిస్తే, గెలుపు సులువవుతుందని వివేకా భావించినట్టు తెలుస్తోంది. ఇక డీఎల్ చేరికపై కూడా జగన్ వద్ద వివేకాయే మధ్యవర్తిత్వం జరిపినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక డీఎల్ రవీంద్రారెడ్డి చేరిక జరిగితే, కడప జిల్లాలో వైకాపాకు ఉన్న పట్టు మరింత బలపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.