: ఉద్యోగులను ఊరిస్తున్న 2017.. సుదీర్ఘ వారాంతాలతో పండుగే పండుగ!
వస్తూవస్తూ 2017 ఉద్యోగులకు శుభవార్త మోసుకొచ్చింది. ప్రతి నెలా ఓ సుదీర్ఘ వారాంతంతో ఉద్యోగుల్లో జోష్ నింపింది. ముఖ్యంగా మల్టీ నేషనల్ కంపెనీల్లో పనిచేసే వారికి ఈ ఏడాది నిజంగా పండుగే. ఈ ఏడాదిలో మొత్తం 12 సుదీర్ఘ వారాంతాలు రానున్నాయి. గతేడాది దీపావళి, గాంధీ జయంతి, క్రిస్మస్ సహా ఇతర పండుగలు ఆదివారం వచ్చి ఉద్యోగులను నిరాశపరిచాయి. కానీ ఈసారి మాత్రం బ్యాంకు సెలవులకు ఒకరోజు ఇటుకానీ, అటుకానీ వస్తున్నాయి. ఈనెలలో రిపబ్లిక్ డే గురువారం వచ్చింది. కాబట్టి శుక్రవారం ఒక్క రోజు సెలవు పెట్టుకుంటే ఏకంగా నాలుగు రోజులు ఎంచక్కా ఎంజాయ్ చేయవచ్చు. వచ్చే నెల 24న శివరాత్రి. ఆ రోజు శుక్రవారం. దీంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. అలాగే రంజాన్, గుడ్‌ఫ్రైడే, కృష్ణాష్టమి, వినాయక చవితి తదితర పండుగలు కూడా వారాంతాల్లో వస్తుండడంతో ఉద్యోగులకు బాగా కలిసొచ్చింది.
ఇక సందట్లో సడేమియాలా ఈ సెలవులను క్యాష్ చేసుకునేందుకు ట్రావెల్ కంపెనీలు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. పలు రకాల ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. విమానయాన సంస్థలు ప్రత్యేక డిస్కౌంట్లతో పర్యాటకులను ఊరిస్తున్నాయి.