: లిబియా సముద్ర తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 180 మంది జలసమాధి
లిబియా సముద్ర తీరంలో పెను విషాదం చోటుచేసుకుంది. శరణార్థులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురై మునిగిపోవడంతో 180 మంది మధ్యధరా సముద్రంలో జలసమాధి అయ్యారు. శనివారం లిబియా తీరం నుంచి శరణార్థులతో బయలుదేరిన టూటైర్ పడవ ఐదు గంటలపాటు ప్రయాణించాక మోటారు పాడైంది. దీంతో పడవలోకి నీళ్లు ప్రవేశించి క్రమంగా మునిగిపోయింది. ఈ ఘటనలో 180 మంది మృతి చెందగా 38 మంది మాత్రం సురక్షితంగా బయటపడి మంగళవారం ట్రపానిలోని సిసిలియన్ నౌకాశ్రయానికి చేరుకున్నారు. మృతి చెందినవారు తూర్పు ఆఫ్రికాకు చెందినవారని అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు , ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ ప్రతినిధులు మృతదేహాల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఏడాది ఆరంభంలో జరిగిన అతిపెద్ద విషాదం ఇదేనని అధికారులు పేర్కొన్నారు.