: పొరపాటుపడిన సైన్యం.. శరణార్థులపై బాంబుల మోత.. వందమందికి పైగా మృతి
నైజీరియా సైన్యం చేసిన పొరపాటుకు వందమంది శరణార్థుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దేశాన్ని అతలాకుతలం చేస్తున్న బొకో హరాం తీవ్రవాదులపై వేసిన బాంబులు పొరపాటున శరణార్థి శిబిరంపై పడడంతో వందమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. శరణార్థులతోపాటు వారికి చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కూడా మృతి చెందారు. బొకోహరాం తీవ్రవాదుల గుప్పిట్లో ఉన్న ఈశాన్య నైజీరియాలోని రన్ నగరంపై మంగళవారం నైజీరియా సైన్యం దాడులకు దిగింది. పెద్ద ఎత్తున వైమానిక దాడులు జరిపింది. నగరంలోని తీవ్రవాద శిబిరాలే లక్ష్యంగా బాంబులు వేసింది. అయితే ఉగ్రశిబిరాలపై వేసిన బాంబులు పొరపాటున శరణార్థుల శిబిరంపై పడడంతో వందమందికిపైగా మృతి చెందినట్టు మిలటరీ కమాండర్ మేజర్ జనరల్ లక్కీ ఇరాబర్ పేర్కొన్నారు. తమవైపు నుంచి పెద్ద పొరపాటు జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.