: ఎమ్మెల్సీగా నారా లోకేశ్.. మంత్రివర్గ విస్తరణలో 'చినబాబు'కు ఛాన్స్ ఖాయం!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు తదుపరి మంత్రివర్గ విస్తరణలో చోటు ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో త్వరలో 22 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఎమ్మెల్యేల కోటా నుంచి ఏడు సీట్లకు ఎన్నిక జరగనుంది. అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న బలాన్ని బట్టి చూస్తే టీడీపీకి ఆరు, వైసీపీకి ఒకటి దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల కోటా నుంచే లోకేశ్ ఎమ్మెల్సీగా ఎన్నికవుతారని సమాచారం.
చట్ట సభలోకి లోకేశ్ ఎమ్మెల్సీగా వస్తే బాగుంటుందా? లేక ఎమ్మెల్యేగా వస్తే బాగుంటుందా? అనే చర్చ పార్టీలో జరిగింది. ఎమ్మెల్యేగా వస్తేనే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడినా ప్రస్తుతం ఎమ్మెల్యే స్థానాలు ఖాళీ లేవు. ఎవరితోనైనా ఖాళీ చేయించి ఆ స్థానంలో లోకేశ్‌ను బరిలోకి దింపాల్సి ఉంటుంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి రాజీనామాకు ముందుకొచ్చారు. ఆ స్థానం నుంచి లోకేశ్‌ను పోటీచేయించాలని కోరారు. ఈ నియోజకవర్గం కుప్పంకు ఆనుకుని ఉంది. దీంతో తండ్రీకొడుకుల సీట్లు పక్కపక్కన ఉండడం సరికాదనే ఉద్దేశంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టారు.
లోకేశ్ కోసం ఎమ్మెల్యేతో రాజీనామా చేయించడం మంచి సంప్రదాయం కాదని సీనియర్ నేతలు పేర్కొన్నారు. దీనికంటే లోకేశ్‌ను ఎమ్మెల్సీగా చట్టసభలోకి తీసుకురావడం మంచిదని సలహా ఇచ్చారు. లేదంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బరిలోకి దింపాలని చంద్రబాబుకు సలహా ఇచ్చారు. దీనికి చంద్రబాబు కూడా సుముఖత వ్యక్తం చేశారు. మరోవైపు వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోకేశ్ ఎమ్మెల్సీగా ఎన్నికై చట్టసభలోకి అడుగుపెట్టడం దాదాపు ఖాయమైపోయిందని చెబుతున్నారు. మంత్రివర్గ విస్తరణకు ముందే ఎమ్మెల్సీ ఎన్నికలు ఉంటాయని, అందులో లోకేశ్ ఎన్నికవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.