: ఆ పని చేస్తేనే పాకిస్థాన్ తో చర్చలకు సిద్ధమవుతాం!: ప్రధాని మోదీ


పాకిస్థాన్ దేశం ఉగ్రవాదాన్ని వదిలి వేయడంతో పాటు, దానిని పూర్తిగా నిర్మూలించినప్పుడే ఇరు దేశాల మధ్య సమస్యలను చర్చించేందుకు సిద్ధమవుతామని ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు స్పష్టం చేశారు. ఢిల్లీలో రెండో ‘రైజినా డైలాగ్’ కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, భారత్ తరపున తాను లాహోర్ వరకు వెళ్లి వచ్చానని, అయితే, శాంతిని నెలకొల్పేందుకు భారత్ మాత్రమే పూనుకుంటే సరిపోదని, పాక్ కూడా ఆ బాటలో నడవాలని అన్నారు.

ఎవరైతే సీమాంతర ఉగ్రవాదాన్ని, అహింసను ప్రోత్సహిస్తారో వారిని ఒంటరిని చేయాలని సూచించారు. చిరకాలంగా మనకు రష్యా మిత్రదేశంగా ఉందని, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ కు, తమకు మధ్య ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగాయని అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్న ట్రంప్ తో కూడా తాను మాట్లాడానని, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు కొనసాగించేందుకు అంగీకారం కుదిరిందని అన్నారు. రెండు పెద్ద దేశాలు, పొరుగు దేశాలు అయిన భారత్, చైనాల మధ్య వైరుధ్యాలు ఉండటమనేది సహజమేనని ఈ సందర్భంగా మోదీ అన్నారు. కాగా, భారత విదేశాంగ శాఖతో పాటు వివిధ దేశాల విదేశాంగ శాఖల సమన్వయంతో తొలి సమావేశం గత ఏడాది 2016 మార్చి 1 నుంచి 3 వరకు జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న సమావేశం రెండోది. ఈ సమావేశం నేటి నుంచి మూడు రోజులు జరుగుతుంది.

  • Loading...

More Telugu News