: కోహ్లీతో కలిసి ఆడితే అదే లాభం!: కేదార్ జాదవ్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి క్రీజులో ఆడితే ఒక లాభముందని ఇంగ్లండ్ సిరీస్ తొలి వన్డే హీరో కేదార్ జాదవ్ తెలిపాడు. విరాట్ క్రీజులో ఉన్నప్పుడు ప్రత్యర్థి జట్టు బౌలర్ల బంతులు, కెప్టెన్ వ్యూహాలు, ఆటగాళ్ల ఆలోచనలన్నీ విరాట్ ను అవుట్ చేయడంపైనే ఉంటాయని, దీంతో మరో ఎండ్ లో ఉన్న ఆటగాడిని లైట్ తీసుకుంటారని అన్నాడు. అదే కొన్ని లూజ్ బంతులు విసిరేందుకు దోహదం చేస్తుందని, వాటిని వినియోగించుకుంటే పరుగుల వరద పారించవచ్చని అన్నాడు. తాను చేసిందదేనని నిజాయతీగా అంగీకరించాడు. ఇదే విషయాన్ని తొలి వన్డే ముగిసిన అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా తెలిపాడు. జాదవ్ బ్యాటింగ్ శైలిని మ్యాచ్ కు ముందు పరిశీలించామని, అయితే లైట్ తీసుకున్నామని, అతనే మ్యాచ్ ను తమ నుంచి లాగేసుకున్నాడని తెలిపాడు. ఈ మ్యాచ్ లో జాదవ్ వీరోచితంగా ఆడి 120 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.